ఏ వ్యక్తి తప్పు చేసినా ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకోలేరు

చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తీర్పుపై సీఎం చంద్రబాబు స్పందించారు.

By -  Medi Samrat
Published on : 1 Nov 2025 5:03 PM IST

ఏ వ్యక్తి తప్పు చేసినా ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకోలేరు

చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తీర్పుపై సీఎం చంద్రబాబు స్పందించారు. పేదల సేవలో కార్యక్రమంలో ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కోర్టు ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.. న్యాయం జరగడానికి ఆలస్యం అయినా.. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు అన్నదానికి ఈ తీర్పు అతిపెద్ద ఉదాహరణ అన్నారు. అతి దారుణంగా మేయర్ కార్యాలయంలోనే ఆ దంపతుల్ని హత్య చేశారు.. రాష్ట్రంలో ఏ వ్యక్తి తప్పు చేసినా ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకోలేరన్నారు.

ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చ‌రించారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. సత్యసాయి బాబా అనంతపురం జిల్లాకు నీటి సరఫరా విషయంలో నా దగ్గర మాట తీసుకున్నారు.. ఎల్ అండ్ టీ ద్వారా ఆ పనులు చేయించాను.. కానీ గత పాలకులు వాటిని నిలిపేశారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలను 13 నుంచి 23వ‌ తేదీ వరకూ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.

మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్ లతో కమిటీ వేశాం.. సత్యసాయి ట్రస్టుతో కలిసి మంత్రుల కమిటీ శతజయంతి ఉత్సవాలను పర్యవేక్షిస్తుంది. ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తిని అభివృద్ధి చేస్తామ‌న్నారు. అభివృద్ధి అజెండాతో పనిచేస్తున్న బీజేపీ గుజరాత్ రాష్ట్రంలో గడచిన 25 ఏళ్లుగా అధికారంలో ఉందన్నారు. మన రాష్ట్రంలో మేం అభివృద్ధి చేసిన వాటిని గత పాలకులు ధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్లీ వచ్చి వాటినే మొదలు పెట్టాల్సి వస్తోందన్నారు. అభివృద్ధి చేసిన పనులు ధ్వంసం అయితే మళ్లీ వాటినే పునరుద్ధరించటం కష్టతరం అవుతుందన్నారు. ప్రజలంతా ఆలోచించి ప్రభుత్వానికి సహకరిస్తేనే శాశ్వతంగా మంచి జరుగుతుందన్నారు.

Next Story