చాలా బాధపడ్డాను.. అప్పుడే ఈ పరిస్థితి మార్చాలనుకున్నా

కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయని.. కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

By Medi Samrat
Published on : 30 Aug 2025 2:22 PM IST

చాలా బాధపడ్డాను.. అప్పుడే ఈ పరిస్థితి మార్చాలనుకున్నా

కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయని.. కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరమసముద్రంలో బహిరంగ సభలో కుప్పం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. నా జీవితంలో ఇది పవిత్రమైన రోజు.. మీ ఇంటి బిడ్డగా కుప్పం ప్రజలు నన్ను ఆదరించారు.. కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను.. నా ఆనందం మాటల్లో చెప్పలేను.. నా సంకల్పం నిజమైందన్నారు.

738 కిలో మీటర్ల నుంచి కుప్పం పరమసముద్రానికి కృష్ణా జలాలు తెచ్చామ‌ని.. ఏడు వందల మీటర్లు ఎత్తుకు నీళ్లు తెచ్చామ‌ని వెల్ల‌డించారు. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నిర్మాణంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి మారింది.. అందుకే శతాబ్దాలు గడిచినా.. కాటన్ దొరను గోదావరి ప్రజలు ఇంకా మరువలేదు.. అలాగే రాయలసీమకు నీళ్లు తెచ్చేందుకు సంకల్పం తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. పశువులను కాపాడుకోవడానికి రైళ్లల్లో నీళ్లు తెప్పించాల్సిన దారుణమైన కరవు రాయలసీమలో ఉండేది.. అప్పుడే చాలా బాధపడ్డాను.. ఈ పరిస్థితి మార్చాలనుకున్నా.. 1999లో హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశాను..శ్రీశైలం మల్లన్న దగ్గరున్న జలాలను కుప్పం మల్లన్న వద్దకు చేర్చాం.. గంగమ్మ ఆశీర్వదించింది... కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందన్నారు. కుప్పం ప్రజల ఆనందంలో పాలుపంచుకునేందుకు సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి పరమసముద్రం చెరువులో బోటులో పర్యటించానని పేర్కొన్నారు. రాయలసీమను రాళ్ల సీమ కానివ్వను.. రతనాల సీమ చేస్తానన్నారు.

2014-19 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టాం. 2019-24 మధ్య కాలంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ. 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. గతం ఓసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సెట్టింగులు వేశారు.. గేట్లు తెచ్చారు.. నీళ్లు కూడా బయట నుంచే తెచ్చి.. విడుదల చేసినట్టు మభ్య పెట్టారు. విమానం ఎక్కేలోగానే నాడు విడుదల చేసిన నీరు ఆవిరైపోయిందన్నారు. అబద్దాలు చెప్పడంలో వైసీపీ దిట్ట.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఎన్డీఏ వల్లే సాధ్యం అన్నారు. కుప్పానికి నీళ్లు రాగానే జీర్ణించుకోలేకపోతున్నారు.. బయట నుంచి నీళ్లు తెచ్చి మభ్యపెట్టడం వైసీపీకి అలవాటు.. చెరువులను నీళ్లతో నింపడం మాకు అలవాటు అన్నారు.

Next Story