పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, దీనిపై పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వృథాగా సముద్రంలోకి పోతున్న గోదావరి వరద జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా తరలిస్తామని శాసనసభలో తెలిపారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు తాము ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదని, ఈ అనుసంధాన ప్రాజెక్టు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని ఆయన అన్నారు.
2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా నీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పరిశ్రమలు, పెట్టుబడులకు నీరే కీలకమని అన్నారు. ప్రతి ఎకరాకు నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడమే తన లక్ష్యమని, దీనికోసం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై త్వరలోనే ఒక బ్లూప్రింట్ విడుదల చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనివేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 2014-19 మధ్య సాగునీటి రంగానికి రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. ఎన్టీఆర్ హయాంలోనే రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులు వచ్చాయని, తాము పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి, శ్రీశైలంలో 100 టీఎంసీలు రాయలసీమకు తరలించామన్నారు.