దీపం వెలగదన్నారు.. ఫ్రీ బస్సు కదలదన్నారు.. కానీ..
ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభలో ప్రసంగించారు.
By - Medi Samrat |
ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభలో ప్రసంగించారు. సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభకు తరలి వచ్చిన మూడు పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సభ రాజకీయాల కోసం, ఎన్నికల కోసం ఓట్ల కోసం కాదు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ సభ.. సూపర్ సిక్స్ పథకాలను- సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు.
నేపాల్ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారు.. వారిని స్వస్థలాలకు తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేష్ కి బాధ్యతలు అప్పగించాం.. ఆయన రియల్ టైమ్ గవర్నెన్సులో ప్రతీ క్షణం సమీక్షిస్తూ చిక్కుకు పోయిన వారిని వెనక్కు రప్పించే ప్రయత్నంలో ఉన్నారు.. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు అన్నారు.
57 శాతం మంది ప్రజలు ఓట్లేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారు. గత పాలకులు ప్రజా వేదికను కూల్చి వేతతో విధ్వంసం మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టింది. అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పెట్టుబడుల్ని తరిమేసి పరిశ్రమలు రాకుండా చేశారు. 93 పథకాలను నిలిపేశారు. పేద, మధ్యతరగతి జీవితాలను మార్చేందుకు సూపర్ సిక్స్ గా హామీ ఇచ్చాం. అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు.
సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు.. పింఛన్ల పెంపు అంటే అసాధ్యం అన్నారు.. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారు.. మెగా డీఎస్సీ అవ్వదన్నారు.. దీపం వెలగదన్నారు.. ఫ్రీ బస్సు కదలదన్నారు.. కానీ, కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం.. నేడు మళ్లీ దీపం-2 పథకం ద్వారా ఉచితంగా ఏటా 3 సిలిండర్లు ఇస్తున్నాం.. ఇప్పటికే రూ.1704 కోట్లు ఖర్చు చేసి... 2.45 కోట్ల ఉచిత సిలిండర్లు మహిళలకు ఇచ్చామని తెలిపారు. ప్రతీ ఇంటా వెలుగులు నింపాం కాబట్టే... ‘దీపం 2’ సూపర్ హిట్ అయ్యిందన్నారు.
రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. మనకు అన్నంపెట్టేది అన్నదాత... రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చాం. కేంద్రంతో కలిసి ఏడాదికి 3 విడతల్లో రూ. 20 వేలు ఇస్తామన్నాం. తొలి విడతగా ఇప్పటికే రూ. 7 వేలు ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు జమ చేశామని తెలిపారు.
నీళ్లిచ్చాం.. మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం... మార్కెట్ గిట్టుబాటు ధర వచ్చేలా చేశాం. ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా నేను చూసుకుంటాను. ఎంత యూరియా కావాలో అంతే వాడండి. కేంద్రాన్ని అడిగిన వెంటనే యూరియా ఇచ్చారు. ఆర్ధిక కష్టాలున్నా...అండగా నిలిచాం కాబట్టే ‘అన్నదాత సుఖీభవ’ సూపర్ హిట్ అయ్యిందన్నారు.
పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. వీటి ద్వారా ఇప్పటివరకు 5.60 కోట్ల భోజనాలతో కడుపు నింపాం. ఇంతకంటే ఆనందం ఏముంది.? గత ప్రభుత్వం పేదల పొట్టకొట్టి.. అన్న క్యాంటీన్లను మూసేసింది. ఆటో మిత్ర కింద ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఆర్థిక సాయం చేస్తాం. ఎన్నికల్లో చెప్పాం... ఎన్ని కష్టాలున్నా చేస్తాం. ఇదీ పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని పేర్కొన్నారు.