సభలో నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో వున్న రోడ్లన్నింటినీ వచ్చే సంక్రాంతి నాటికి గుర్తులు లేని రహదారులుగా రూపొందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు
By Medi Samrat Published on 2 Nov 2024 5:45 PM ISTరాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో వున్న రోడ్లన్నింటినీ వచ్చే సంక్రాంతి నాటికి గుర్తులు లేని రహదారులుగా రూపొందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంక్రాంతికి ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారు తమ రాష్ట్రంలోని రోడ్డును చూసి గర్వపడే విధంగా రోడ్లు ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.860 కోట్లతో చేపట్టిన గుంతలు లేని రహదారులు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి జిల్లా పరవాడలో శనివారం శ్రీకారం చుట్టారు. వెన్నెలపాలెం జంక్షన్ వద్ద రోడ్డు మరమ్మత్తు పనుల శిలాఫలకం ఆవిష్కరించి తానే స్వయంగా యంత్రాన్ని ఆపరేట్ చేసి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పటైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం కూటమి ప్రభుత్వం చేపట్టనున్న భవిష్యత్ కార్యాచరణను వివరించారు.
సంక్రాంతి సమయంలో రోడ్లపైకి డ్రోన్లను పంపించి గుంతలను తనిఖీ చేయిస్తామని చెప్పారు. సకాలంలో రోడ్ల పనులను పూర్తి చేయని కాంట్రాక్టర్లను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో రోడ్లను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలోని రోడ్లన్నీ నరకానికి రహదారులుగా తయారయ్యారని ముఖ్యమంత్రి చెప్పారు వీటన్నిటికీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి రెండు నెలల్లో గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దే బాధ్యత రోడ్లు భవనాల శాఖపై పెట్టామన్నారు. రోడ్లు నాగరికతకు చిహ్నమని రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు రావడంతో పాటు అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని, మంచి రోడ్లు కూడా వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. అది పరవాడ గ్రామం నుంచే ప్రారంభం అవుతుందన్నారు
అనంతరం ఆయన మాట్లాడుతూ సభలో నవ్వులు పూయించారు. దీపం పథకంలో మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్ లను అందించే కార్యక్రమం ద్వారా తాను కూడా టీ చేయడం నేర్చుకున్నట్టు చెప్పారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. మగవారు అంతా ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తమ భార్యలకు టీ చేసివ్వడం ద్వారా వారిని తమతో సమానంగా గౌరవించ వచ్చన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో గాడితప్పిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కోన్నారు