అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో పలువురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
బస్సు ప్రమాదం,క్షతగాత్రులకు అందతున్న సాయంపై అధికారులతో మాట్లాడారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని...పలువురు మృతి చెందగా...గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.