అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ఏపీలోని అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

By Kalasani Durgapraveen  Published on  23 Nov 2024 6:59 PM IST
అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ఏపీలోని అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెందారు. గార్లదిన్నె మండలం కలగాసపల్లె వద్ద ఆర్టీసీ బస్సు వ్యవసాయ కూలీలు వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో గాయపడ్డ మరికొందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్ర‌మాద‌ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన సీఎం.. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Next Story