కుప్పంలో రెండో రోజు చంద్రబాబు బిజీబిజీ..!
కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.
By - Medi Samrat |
కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సహా వివిధ కార్యక్రమాలకు సీఎం హాజరు కానున్నారు. గుడిపల్లె మండలం, బెగిలపల్లె గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని స్వయంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. డ్వాక్రా మహిళలకు 5,555 ఇ-సైకిళ్ల పంపిణీ చేయనున్నారు. బెగిలపల్లె నుంచి శెట్టిపల్లె వరకూ వేలాది ఇ-సైకిళ్ల ర్యాలీలో పాల్గోనున్నారు. ఒకేమారు వేలాది ఇ-సైకిళ్ళ ర్యాలీతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించేలా కార్యక్రమం నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.
అనంతరం కుప్పంలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రజా వేదిక సభ అనంతరం వివిధ పథకాల లబ్దిదారులతో ఇంటరాక్షన్ కానున్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లబ్దిదారులతో భేటీ కానున్నారు. ఆపై పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో మాట్లాడుతారు.
ఆ తర్వాత కుప్పంలో సీఎన్జీ కాంపాక్టర్లను ఆవిష్కరిస్తారు. నెట్ జీరో, వేస్ట్ మేనేజ్మెంట్ పై ఐఐటీ కాన్సూర్ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తారు. అనంతరం సీఎం సమక్షంలో కుప్పంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన 7 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటారు. రూ. 675 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తులు, గార్మెంట్స్ తయారీ, వుడ్ స్టోన్ ఉత్పత్తుల పరిశ్రమ, ఇంటిగ్రేటెడ్ చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. అలాగే విద్యుత్, ఎలక్ట్రానిక్స్ తయారీ ఉత్పత్తుల సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది.