నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మరో హమీని నెరవేర్చడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు.
By Medi Samrat
నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మరో హమీని నెరవేర్చడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. అర్హులైన నాయీ బ్రాహ్మణులందరికీ ఉచిత విద్యుత్ ను 150 నుంచి 200 యూనిట్లకు పెంచుతూ కేబినెట్ భేటీలో ఆమోదించడంపై సీఎం చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గడిచిన ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల కష్టాలను గుర్తించిన సీఎం చంద్రబాబు ఉచిత విద్యుత్ ను 200 యూనిట్ల వరకూ అందిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, బుధవారం సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో నాయీ బ్రాహ్మణులందరికీ ఉచిత విద్యుత్ ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచుతూ మంత్రిమండలి సభ్యులు ఆమోదం తెలిపారన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ-II సర్వీస్ కింద 40,808 సెలూన్ షాపులు గుర్తింపు పొందాయన్నారు. ఈ షాపులన్నింటికీ నెలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించారు. నాయీ బ్రాహ్మణులకు అందించే ఉచిత విద్యుత్ వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.100.20 కోట్లు భారం పడుతోందన్నారు. నాయీబ్రాహ్మణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు ఇచ్చే గౌరవ వేతనం రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నాయీబ్రాహ్మణులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని ఆ ప్రకటనలో మంత్రి సవిత వెల్లడించారు.