తిరుమల నుంచే ప్రక్షాళ మొదలుపెడతా: సీఎం చంద్రబాబు
తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 13 Jun 2024 6:58 AM GMTతిరుమల నుంచే ప్రక్షాళ మొదలుపెడతా: సీఎం చంద్రబాబు
తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానన్నారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందన్న చంద్రబాబు.. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారు సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇవాళ కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. కానీ ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తానని, ప్రజా పాలన ప్రారంభమైందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యమని, అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలూ మమేకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ''రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయి. వాటిని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. కక్ష సాధింపులు ఉండవు. టీటీడీని ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం'' అని చంద్రబాబు తెలిపారు.