గుంతల రహితంగా రహదారులు ఉండాలి, అధికారులకు సీఎం డెడ్‌లైన్
రాష్ట్రంలో రహదారులన్నింటిని గుంతల రహితంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు
By - Knakam Karthik |
గుంతల రహితంగా రహదారులు ఉండాలి, అధికారులకు సీఎం డెడ్‌లైన్
అమరావతి: కూటమి ప్రభుత్వంలో రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో రాబోయే డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రహదారులన్నింటిని గుంతల రహితంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పనుల స్థితిగతులపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి - మరమ్మత్తుల పనుల తీరుపై ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని ఆర్ అండ్ బి శాఖ మంత్రి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శిలను సీఎం ఆదేశించారు.. అదే సమయంలో ఇప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అదే సమయంలో రహదారులు మరమ్మతు పనుల నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడవద్దని, అత్యుత్తమంగా ఉండేలా చూడాలన్నారు. రహదారుల అభివృద్ధిలో అత్యున్నత సాంకేతిక విధానాలను, వినూత్న మెటీరియల్ ను ఉపయోగించే విధానాలను అందిపుచ్చుకోవాలని సూచించారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులకున్న ప్రాధాన్యత గుర్తించి అందుకు తగిన విధంగా నిధులు కేటాయించామన్నారు సిఎం. గత ఏడాది గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మిషన్ పాత్ హోల్ ఫ్రీ లో భాగంగా రూ. 861 కోట్ల నిధులతో రాష్ట్రంలో రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్దామని.. అయితే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కనీసం రెన్యువల్ కూడా చేపట్టకపోవడం, రహదారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వంటి కారణాల వల్ల రహదారులు మరింత అధ్వాన్నంగా మారాయన్నారు.. అయినప్పటికీ ఈ ఏడాది రహదారుల నిర్వహణ మరియు ఇంప్రూవ్మెంట్ కోసం రూ. 2500 కోట్లతో పనులు చేపట్టేందుకు ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా రూ. 400 కోట్లు నాబార్డ్ నిధులతో 1250 కి.మీ జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం 191 పనులు మంజూరు చేశామన్నారు... ఈ పనులన్నీ ఇప్పటికే టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించామని ప్రకటించారు. ఇవి కాకుండా రూ. 600 కోట్లు మూలధన వ్యయం కింద 227 పనులు మంజూరు చేయడం జరిగింది. వీటితో పాటు 1450 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చేయడానికి గుత్తేదారులను గుర్తించి పనులు అప్పగించామన్నారు
మరో 2,104 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి కోసం 274 పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్న సిఎం. ఇందుకోసం రూ. 1000 కోట్లతో ఆయా పనులకు టెండర్లు పిలిచామన్నారు. డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ పనులన్నింటినీ గుత్తేదారులు గుర్తించి పనులు మొదలు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు... ఇవి కాకుండా వివిధ కారణాలతో గుత్తేదారులకు అప్పగించి రద్దయిన.. రూ. 277 కోట్లతో 607 కి.మీ రహదారుల నిర్వహణ & అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.. రాబోయే 2 – 3 రోజుల్లో ఈ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇవి కాకుండా మరో రూ. 233 కోట్ల రూపాయలతో రహదారులు అభివృద్ధి చేయడం జరుగుతుంది.. ఇందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చాయన్నారు..