నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి: సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik
నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి: సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో మే2వ తేదీన జరిగే సభ ఏర్పాట్లపై చర్చించారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయని.. ఆ రోజు రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానుందని సీఎం అన్నారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాష్ట్ర రాజధాని ప్రయాణం సాగనుందని సీఎం అన్నారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని... అయితే అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల అభిలాష మేర ప్రారంభమైన అమరావతి అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడిందని సీఎం అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో... గత ప్రభుత్వ కారణంగా తలెత్తిన సవాళ్లను పరిష్కరించి, నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని సీఎం అన్నారు. ఏ ప్రధాని చేతుల మీదుగా అయితే శంకుస్థాపన చేసిన రాజధానిని విధ్వంసం చేశారో... నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి... ఒక అద్భుత రాజధానిని నిర్మించి... విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని సీఎం అన్నారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అని... దీన్ని ఎవరూ దెబ్బతీయలేరని సీఎం అన్నారు.
అమరావతి సంపద సృష్టి కేంద్రంగా, అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందని సీఎం అన్నారు. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజా రాజధాని, ఆంధ్రుల స్వప్నాన్ని ఎవరూ చెరిపివేయలేరని చాటి చెప్పేందుకే... మళ్లీ దేశం అంతా గుర్తించేలా రాజధాని పనులను స్వయంగా ప్రధాని చేతుల మీదుగా పున: ప్రారంభిస్తున్నామని సీఎం అన్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, వేడుకగా నిర్వహించాలని... రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్రప్రదేశ్... నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారని... మొన్న జరిగిన ఢిల్లీ భేటీలో పలు సూచనలు చేశారని సీఎం గుర్తు చేశారు.