పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik
పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
అమరావతి: ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె.విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎరువుల లభ్యత, సరఫరా, పక్కదారి పట్టకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. కాగా ఈ సారి 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు రాష్ట్రానికి వచ్చాయని సీఎం అధికారులు తెలిపారు. ఈ క్రాప్ ద్వారా ఎంత సాగు అవుతుంది..ఎంత వినియోగం జరుగుతోంది అనేది లెక్కించాలని సీఎం సూచించారు. పంటల సాగు, సరఫరా, లభ్యత, వినియోగంపై నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలన్నారు. ఎరువులు, పురుగు మందులు వినియోగం తగ్గించిన రైతులకు పలు రకాల సబ్సిడీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉద్యాన పంటలకు ఆయా పంటల సాగు ఖర్చుల ప్రకారం మద్దతు ధర దక్కేలా చూడాలన్నారు. కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్లపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త తెగులు వచ్చిన కాఫీ పంట 20 ఎకరాల్లో ఉందని...వీటిని తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇతర ప్రాంతాలకు తెగుళ్లు వ్యాపించకుండా....నష్టపరిహారం చెల్లించి అయినా తెగులు వచ్చిన పంటను తొలగించాలని సీఎం ఆదేశించారు.