గ్యాస్ లీక్ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష..నష్టపరిహారం అందించాలని ఆదేశాలు
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ బ్లో అవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By - Knakam Karthik |
గ్యాస్ లీక్ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష..నష్టపరిహారం అందించాలని ఆదేశాలు
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ బ్లో అవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బ్లో అవుట్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్నతాధికారులు వివరించారు. గ్యాస్ లీక్‌ను అరికట్టేందుకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యలను సీఎస్ విజయానంద్, హోంమంత్రి అనిత, పోలీసు ఉన్నతాధికారులు, సిఎంవో సహా ఇతర అధికారులు వివరించారు. ప్రమాద స్థలంలో ప్రస్తుత పరిస్థితి, ప్రజల రక్షణకు తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు.
పునరావాస కేంద్రాల్లో ఉన్న ఆయా గ్రామాల ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపైనా అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతారని... వారికి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరించి అండగా నిలవాలని సీఎం సూచించారు. సమస్య పూర్తిగా తీరే వరకు ఇళ్లు, ఊళ్లు వదలిన వారు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని సీఎం చెప్పారు. మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయిన వారికి, ఇతరత్రా నష్టం జరిగిన వారికి నష్టపరహారం అందించే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంటలను అరికట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. కాగా సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా పూర్తి సహకారం అందించాలని సీఎం సూచించారు. భవిష్యత్‌లో ఇటువంటి తరహా ఘటనలు తలెత్తకుండా ఓఎన్‌జీసీ సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో త్వరలో సమావేశం నిర్వహణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.