పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు : చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం సందర్శనకు వెళ్లారు. ప్రాజెక్ట్ పరిశీలన అనంతనం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 17 Jun 2024 12:52 PM GMTఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం సందర్శనకు వెళ్లారు. ప్రాజెక్ట్ పరిశీలన అనంతనం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొందని అన్నారు. ఏడు మండలాలు వచ్చినందునే ప్రాజెక్టు మొదలుపెట్టామని.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారని పేర్కొన్నారు. రాయలసీమకు కూడా గోదావరి జలాలు తీసుకెళ్లే పరిస్థితి వస్తుందని.. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్ వే పై డిశ్చార్జ్ అవుతాయని తెలిపారు. టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టు పూర్తి చేశామని.. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు. ఏజెన్సీతోపాటు సిబ్బంది కూడా మార్చారు. డయాఫ్రమ్ వాల్ ను గత ప్రభుత్వం కాపాడుకోలేదన్నారు. ప్రాజెక్టుపై వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించానన్నారు. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుందన్నారు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారన్నారు.
చైనాలోని త్రీగోర్జెస్ నది కంటే ఎక్కువ ప్రవాహం ఉన్న ప్రాజెక్టు ఇది. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని వివరించారు. అన్నీ సవ్యంగా జరిగితేనే ప్రాజెక్టు పూర్తికి నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని భావించానని పేర్కొన్నారు. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పింది. ఏజెన్సీని మారిస్తే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారు. ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేసు స్టడీ అని అన్నారు. రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా జరిగింది. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు.