మంత్రి అచ్చెన్నపై సీఎం ప్రశంసల వర్షం
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో సీఎం ఛాంబర్‌లో మంత్రుల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
By - Medi Samrat |
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో సీఎం ఛాంబర్‌లో మంత్రుల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా కేక్ కట్ చేయించి మంత్రి అచ్చెన్నాయుడికి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యువనేత, మంత్రి నారా లోకేష్ సమక్షంలో క్యాబినెట్ మంత్రులంతా కలిసి కేక్ కట్ చేసి మంత్రి అచ్చెన్నాయుడికి తినిపిస్తూ ఆత్మీయ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అచ్చెన్నాయుడు చేసిన కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా ప్రజల అభ్యున్నతికై నిత్యం ఆలోచిస్తూ, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయా శాఖల అభివృద్ధికి పాటుపడి రాష్ట్ర పురోగతికి బాటలు వేసిన నాయకుడిగా ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సమక్షంలో తన జన్మదిన వేడుకలు జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి తనపై ప్రత్యేక వాత్సల్యంతో స్వయంగా కేక్ కట్ చేయించి ఆశీర్వదించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన యువనేత నారా లోకేష్, మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి ఆత్మీయత, ఆశీస్సులు తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, రైతన్నల సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.