బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్త గొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు అనంతరం ప్రజా సభకు హాజరయ్యారు. తాను ఇప్పుడు ఇస్తున్న ఫించన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని అన్నారు. పింఛన్ల రూపంలో నెలకు 2,722 కోట్లు పంపిణీ చేస్తున్నామని, ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. గతంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదని, కానీ ఒక నెల పింఛను తీసుకోకపోతే రెండవ లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చానన్నారు.
రాష్ట్రంలోని కోటిన్నర కుటుంబాలకు గాను 64 లక్షల పింఛన్లు ఇస్తున్నామని ఏపీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో సగటున రెండున్నర కుటుంబాలకు పింఛను ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని అన్నారు. ప్రతి నెల 1వ తారీఖునే 98 శాతం పింఛన్లు పంపిణీ చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటికీ సౌర విద్యుత్ వెలుగులు అందాలని భావిస్తున్నానన్నారు. తాగునీరు, డ్రెయినేజి, వంట గ్యాస్, ఇంటర్నెట్ సహా అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలే ముందు, ఆ తర్వాతే మిగతా పనులని ఏపీ సీఎం చెప్పుకొచ్చారు.