నెలలోనే ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తాం.. త్వరలోనే నిరుద్యోగ భృతికి శ్రీకారం చుడ‌తాం

ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేయడంతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

By Medi Samrat
Published on : 1 July 2025 8:30 PM IST

నెలలోనే ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తాం.. త్వరలోనే నిరుద్యోగ భృతికి శ్రీకారం చుడ‌తాం

ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేయడంతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగుల పేరుతో పింఛన్లు దోచేశారని అన్నారు. అమ్మఒడి పేరుతో మోసం చేస్తే.. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఎందరు పిల్లలున్నా తల్లికి వందనం అందిస్తోందని చెప్పారు. కొవ్వూరు నియెజకవర్గం మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సానమాండ్ర పోశిబాబు ఇంటికి వెళ్లి చర్మకార పింఛను అందజేశారు. అనంతరం పోశిబాబు కుటుంబసభ్యులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరో లబ్ధిదారు గెడ్డం కృష్ణదుర్గ నివాసానికి వెళ్లి వితంతు పెన్షన్ అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్ధేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

మన ప్రభుత్వమే అధిక పింఛన్లు ఇస్తోంది

‘గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా వచ్చేవికావు. రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు వచ్చేవి కావు. కానీ మన ప్రభుత్వం వచ్చాక ఒకటవ తేదీనే ఇస్తున్నాం. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.4,000 వేలు చేశాను. డయాలసిస్ రోగులకు రూ.10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తూ మానవత్వాన్ని నిరూపించుకున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్టే పింఛన్లూ అందిస్తున్నాము. గత ప్రభుత్వం పింఛను పెంచుతామని ఏం చేసిందో చూశారుగా. పెద్ద పెద్ద రాష్ట్రాలు పెన్షన్ పంపిణీలో మన దరిదాపుల్లో లేవు. ఏ రాష్ట్రంలోనూ ఇంతపెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదు. పింఛన్ల కోసం నెలకు రూ.2,750 కోట్లు వెచ్చిస్తున్నాము.. తెలంగాణలో కేవలం రూ. 8 వేల కోట్లు, కేరళలో రూ.7,200 కోట్లు పింఛను కోసం ఖర్చు చేస్తున్నారు.’ అని సీఎం వివరించారు.

రాజకీయ ముసుగులో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కుదరదు

‘గత ప్రభుత్వంలో వైకల్యం లేకున్నా పింఛన్లు ఇచ్చారు. ఐదేళ్లలో అరాచకాలు చేశారు. రాజకీయ ముసుగు వేసుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే వారి విషయంలో కఠినంగా ఉంటాను. ప్రజా ధనం దుర్వినియోగం కానివ్వను. ప్రజా ప్రభుత్వంలో మోసాలకు తావులేదు. ఏడాదిగా పోటీ పడి పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను. పింఛను ఇచ్చేప్పుడు నవ్వుతూ, సేవాభావంతో ఇవ్వాలని సూచించాను. మనం పవిత్రమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. మీరు పెన్షన్ తీసుకున్న వెంటనే ఎంత డబ్బు తీసుకున్నారో యాప్ లో ఒక మెసేజ్ వస్తుంది. ఒకప్పుడు భర్త చనిపోతే వితంతువుకు పింఛను ఇచ్చేవారు కాదు. కానీ నేడు భర్త చనిపోతే వెంటనే ఆటోమేటిక్ గా భార్యకు పింఛను ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకునేలా ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలో రెండు నెలలు పింఛను తీసుకోని వారు లక్షా 20 వేల 461 మంది ఉన్నారు. వీరికి పింఛను ఇవ్వకపోతే రూ. 98 కోట్ల 19 లక్షలు ప్రభుత్వానికి మిగులుతుంది. కానీ ఆ ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు.’ అని అన్నారు.

కనీవిని ఎరుగని రీతిలో పుష్కరాలు

‘వైసీపీ నేతలు మెగా డీఎస్సీకి అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ నెలలోగా ఉపాధ్యాయుల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎవరైనా డగ్స్, గంజాయి అమ్మితే తాట తీస్తా. గంజాయి బ్యాచ్‌ను పరామర్శించే వారిని ఏమనాలి? ప్రజలను కాపాడుకోడానికి నేరస్థులతో రాజకీయం చేయాల్సి వస్తోంది. సమైక్యాంధ్రలో, నవ్యాంధ్రలో ముఖ్యమంత్రిగా నా ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలు నిర్వహించాను. ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం. నేను, నా మిత్రుడు పవన్ కల్యాణ్ చెప్పినట్టే మాట నిలబెట్టుకుంటున్నాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నాం. ఏడాది పాలన పూర్తి చేసి సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. సీఎం పదవి నాకు కొత్త కాదు. సమైక్యాంధ్రలో 9 ఏళ్లు ముఖ్యమంత్రి గా ఉన్నాను. 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. కానీ గత ఐదేళ్లు జరిగిన విధ్వంసం నా జీవితంలో చూడలేదు. వ్యవస్థలు పడకేశాయి. ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైంది. ప్రభుత్వ విభాగాలు పనిచేయలేదు. వాటన్నింటినీ అధ్యయనం చేయడానికి నాకే ఏడాది పట్టింది. 204 అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. దీపం పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఒక్క తల్లికి వందనం పథకం ద్వారా రూ. 10 వేల కోట్లు తల్లుల అకౌంట్ లో వేశాం. 1, 11వ తరగతి విద్యార్థులకు అడ్మిషన్లు అవగానే వారికీ వేస్తాం.’ అని ముఖ్యమంత్రి అన్నారు.

రైతులకు అండగా నిలబడ్డాం

‘రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో సాగునీరు ఇస్తున్నాం. విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నాం. గత ప్రభుత్వంలా కాకుండా రైతులకు దగ్గరలో ఉన్న రైసు మిల్లులో ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించాం. ఇన్ పుట్ సబ్సిడీ కూడా రైతుల అకౌంట్‌లో వేశాం. ఈ నెలలో కేంద్రం అన్నదాత సుఖీభవ కింద డబ్బు వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసేస్తుంది. ఆగస్టు 15 నుంచి ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. యోగాంధ్ర ద్వారా రెండు గిన్నీస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ రికార్డులు సాధించాం. యోగాంధ్ర నిర్వహణను ప్రధాని ప్రశంసించారు. ఆడబిడ్డపై చేయి వేస్తే వారికి అదే చివరి రోజు. రాష్ట్రమంతటా సీసీ టీవీ కెమెరాలు పెడతాం. ఎవర్నీ వదిలిపెట్టను. రౌడీయిజాన్ని సహించం. నేను అభివృద్ధి చేస్తుంటే రాక్షసుల మాదిరి భగ్నం చేయాలని చూస్తున్నారు.

త్వరలోనే నిరుద్యోగ భృతికి శ్రీకారం

‘రాష్ట్రాభివృధ్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది. అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్లు సాయం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,400 కోట్లు కేటాయించింది. 9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాం. వీటి ద్వారా 8 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. వాటి ద్వారా 4 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. పదేళ్లలో ఎంత పెట్టుబడులు వచ్చాయో ఒక్క ఏడాదిలో అంతకంటే ఎక్కువ పెట్టుబడులు తెచ్చాం. వీలైనంత త్వరలో నిరుధ్యోగ భృతికి శ్రీకారం చుడతాం. పోలవరాన్ని గత ప్రభుత్వం ఏ విధంగా భ్రష్టు పట్టించిందో మీరే చూశారు. డయాఫ్రం వాల్ మేము పూర్తిచేస్తే కాఫర్ డ్యామ్ పూర్తి చేయలేదు. ఆ భగవంతుడు పోలవరం పూర్తిచేసే బాధ్యత నాకే ఇచ్చారు. 2027కి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం. దేశంలో ఎక్కడా రాని విధంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే ప్రాజెక్టు పోలవరం. అది ప్రమాదంలో పడకూడదు. డిసెంబర్ కు డయాఫ్రం వాల్ పూర్తిచేస్తాం. గత ఐదేళ్లలో 4 శాతం పనులు పూర్తిచేస్తే నేను ఒక్క ఏడాదిలో 6 శాతం పూర్తిచేశాం’ అని వివరించారు.

రాజకీయాల్లోకి రౌడీలు

‘ఒకప్పుడు రాజకీయాల్లో రౌడీలు ఉండేవారు కాదు...కానీ ఇప్పుడు నేరుగా వస్తున్నారు. వారే నేతలుగా తయారవుతున్నారు. తప్పు చేస్తే ఎవర్నీ వదలిపెట్టం. పాయకరావుపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో విద్యార్థులకు సరైన ఆహారం పెట్టని అధికారులను సస్పెండ్ చేశాను. నేను ప్రతి అడుగూ ఆచితూచి వేస్తాను. వివేకా హత్య విషయంలో నన్నే ఏమార్చారు. వివేకా గుండెపోటుతో చనిపోయాడని సాక్షి టీవీలో స్క్రోలింగ్ వేస్తే అందరిలాగే నేనూ నమ్మాను. రూమంతా నెత్తురు ఉంటే కడిగేశారు. కొత్త బెడ్ షీట్ వేశారు. కుట్లు వేశారు. అంత్యక్రియలకు రెడీ అయ్యారు. వివేకా కుమార్తెకు అనుమానం వచ్చి పోస్టుమార్టమ్ చేయించమంది. గుండెపోటు కాదు గొడ్డలిపోటని పోస్టుమార్టమ్ లో తేలింది. సాక్షి పేపర్ లో నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఒక ముఖ్యమంత్రి అయినా ఆనాడు నేను నిస్సహాయుడినయ్యాను. ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే రాష్ట్రానికి మంచి జరిగేది. గత ఐదేళ్లు నన్ను బయటకు రానివ్వలేదు. నా ఇంటికి తాళ్లు కట్టారు. విశాఖ వెళితే తిరిగి పంపారు. తెనాలిలో రౌడీషీటర్లను పలకరించారు. ఇరుకు సందుల్లో మీటింగ్ వద్దంటే వినడంలేదు. కారు కింద వ్యక్తి పడితే తొక్కించి ఈడ్చి పక్కనపడేశారు. జగన్ కారు కిందే సింగయ్య పడ్డాడని పూర్తి ఆధారాలు లభించాయి. నేను ఎలాంటి వారితో రాజకీయాలు చేస్తున్నాను? నా జీవితంలో ఒక వ్యక్తిని కొట్టింది కూడా లేదు. ప్రజల కోసమే నేరస్థులతో రాజకీయం చేయాల్సి వస్తోంది. ఒక పెళ్లి చేయాలంటే ఏడు తరాలు చూస్తారు. కానీ ఒక నేతను ఎన్నుకునేటప్పుడు గుడ్డిగా ఓటేస్తారా? ప్రజలు ఆలోచించాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు.

Next Story