అమరావతి: విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. అయిదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని భరోసా ఇచ్చారు. శనివారం నగరిలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. జగన్ హయాంలో రూ.32 వేల కోట్ల విద్యుత్ భారం మోపారని విమర్శించారు. రూ.1.2 లక్షల కోట్ల అప్పుల్లోకి డిస్కంలను నెట్టివేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.4,600 కోట్ల విద్యుత్ పన్ను రద్దు చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రానున్న మూడేళ్లలో విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ.1.20 పైసలు తగ్గిస్తామని సీఎం పేర్కొన్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రాజ ముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తున్నామని, రూ. 700 కోట్లతో సర్వే రాళ్ళ మీదా ఫోటో వేసుకొని రైతుల పొలాల్లోనూ తన బొమ్మే ఉండాలనుకున్నాడు. కానీ ప్రజలు శాశ్వతంగా మాకొద్దు అని ఇంటికి పంపించారని జగన్ ను ఉద్దేశించి సీఎం అన్నారు.