సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు స్వచ్ఛతా అవార్డులు
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేయనున్నారు.
By - Knakam Karthik |
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు స్వచ్ఛతా అవార్డులు
అమరావతి: స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాల్లో ఉత్తమ పనితీరు కనపరిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమంలో భాగంగా వీటిని అందించనున్నారు.
రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ స్వచ్ఛతను పాటించటంలో అగ్రస్థానంలో ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలకు అవార్డులు సీఎం చేతుల మీదుగా అందచేయనున్నారు. మొత్తం 21 కేటగిరీల్లో రాష్ట్రస్థాయిలో 69 అవార్డులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు విజేతలకు అందించనున్నారు. స్వచ్ఛ మునిసిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమల కేటగిరీల్లో ఈ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు గానూ రాష్ట్ర స్థాయిలో 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి.
మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు, కుప్పం మున్సిపాలిటీలు సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నాయి. స్వచ్ఛ గ్రామ పంచాయితీలుగా ఎంపికైన అనకాపల్లి జిల్లా చౌడువాడ, ప్రకాశం జిల్లా ఆర్ఎల్ పురం, కోనసీమలోని లోల్ల, కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, కడప జిల్లాలోని చెన్నూరు, చిత్తూరు జిల్లాలోని కనమకులపల్లె సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నాయి. స్వచ్ఛతకు పెద్దపీట వేసిన పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, స్వయం సహాయక సంఘాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అవార్డులు అందించనున్నారు.