జీఎస్టీ ఉత్సవ్‌లో అలా చేద్దాం..సీఎం కీలక సూచనలు
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు
By - Knakam Karthik |
జీఎస్టీ ఉత్సవ్‌లో అలా చేద్దాం..సీఎం కీలక సూచనలు
అమరావతి: టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుంది... దేశంలో ఇదొక నూతన అధ్యాయం. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలి. జీఎస్టీ ఉత్సవ్‌లో భాగంగా జీఎస్టీ సంస్కరణలను వివరిద్దాం. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలి. కూటమి పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారాన్ని నిర్వహించాలి. పారిశ్రామిక, ఆటో మొబైల్, ఫార్మా, వంటి కంపెనీలకు జీఎస్టీ సంస్కరణలో మేలు జరుగుతుంది. టూ వీలర్, ఏసీలు, కార్లు, వంటి ఇంటి వస్తువుల ధరలు తగ్గుతాయి. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువులకు తగ్గాయి... రోగులు వాడే మందులపై జీఎస్టీ లేదు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రూ. 8 వేల కోట్ల మేర లబ్ది జరుగుతుంది..అని సీఎం పేర్కొన్నారు.
మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గినా సంస్కరణల వల్ల ప్రజలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చేశామో వివరించాం... అదే తరహాలో జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టాలి. కార్యకర్తల భాగస్వామ్యంతో యోగాడే సక్సెస్ అయింది.. అలాగే జీఎస్టీ ఉత్సవ్ ను సక్సెస్ చేయాలి. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు... అదే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రం సభకు వస్తారు.. ఇదేం ద్వంద్వం వైఖరి.. ఇది డ్రామా కాదా...? పార్టీ కార్యకర్తలైనా.. నాయకులైనా ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలి... మంచి చెడులను ప్రజలకు వివరించాలి. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్తానంటే ప్రజలు హర్షించరు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టేసింది. వైసీపీ ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో భారం పడింది. 15 నెలల కాలంలో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాం... అనేక సమస్యలను పరిష్కరించాం. నేడు తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాం. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా విద్యుత్ కొనుగోళ్లల్లో సుమారు రూ.1000 కోట్లు ఆదా చేశాం. ఆ మేరకు రానున్న కాలంలో ప్రజలపై రూ.1000 కోట్ల భారాన్ని తగ్గిస్తున్నాం. సూపర్ సిక్స్ సహా అనేక మేనిఫెస్టో హామీలను నెరవేర్చాం. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలి..అని సీఎం చంద్రబాబు అన్నారు.