ఆ నౌకలో వచ్చే యూరియాను ఏపీకి కేటాయించండి..నడ్డాకు సీఎం చంద్రబాబు ఫోన్
యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik
ఆ నౌకలో వచ్చే యూరియాను ఏపీకి కేటాయించండి..నడ్డాకు సీఎం చంద్రబాబు ఫోన్
అమరావతి: యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని అధికారులు తెలపగా..మరో 10 రోజుల్లో 23592 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని వివరించారు.
నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా ఎరువుల కేటాయింపు అంశంపై సమీక్షలోనే కేంద్ర మంత్రి నడ్డాతో ఫోన్‌లో సీఎం మాట్లాడారు. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 రేక్ ల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు. యూరియా విషయంపై కేంద్ర మంత్రి నడ్డా సానుకూలంగా స్పందించారు.
మరో వైపు వచ్చే రబీ సీజన్ కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణాళికలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు ఎరువుల పై భరోసా ఇవ్వాలని సీఎం సూచించారు. ఎరువులు దొరకవనే ఆందోళనతో ఒకే సారి కొనుగోలు చేయకుండా, నిల్వ చేసి పెట్టుకోకుండా చూడాలన్న సీఎం..కర్నూలు మార్కెట్ లో ఉల్లి కొనుగోళ్లు, మద్దతు ధరపైనా సిఎం సమీక్షించారు. ఉల్లి ధర క్వింటాలుకు రూ.1200 తగ్గకుండా చూడాలని స్పష్టం చేశారు. రైతులు ఎవరైనా క్వింటాకు రూ.1200 కంటే తక్కువ ధరకు అమ్ముకుంటే.. ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.