కలెక్టర్ల సదస్సులో పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు

5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పొగిడారు.

By -  Knakam Karthik
Published on : 17 Dec 2025 12:27 PM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, Collectors Conference, Deputy CM Pawankalyan

కలెక్టర్ల సదస్సులో పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు

అమరావతి: 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పొగిడారు. డిప్యూటీ సీఎం పవన్ వేరే రంగం నుంచి వచ్చినా..పరిపాలనలో చక్కటి పని తీరు కనబరుస్తున్నారు. 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించింది. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారు. ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే... తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించారు..ఇలా ఉండాలి బాధ్యతగల ప్రభుత్వం అంటే..అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కలెక్టర్లు కూటమి సర్కార్‌కు మంచి పేరు వచ్చేలా చూడాలి

జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది..అని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సదస్సులో మాట్లాడారు. లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేస్తే 15 శాతం వృద్ధి రేటు సాధన కష్టం కాదు. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్ లాంటి అంశాల ద్వారా ఈ వృద్ధిని సాధిద్ధాం. మన ప్రభుత్వానికి వారసత్వంగా 70 శాతం మేర ధ్వంసమైన రోడ్లు వచ్చాయి. నీటి సమస్యలు, మద్ధతు ధరలు లేకపోవటం, భూ వివాదాలు, విద్యుత్ బిల్లులు ఎక్కువ రావటం లాంటి సమస్యలు కూడా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పుడు మనం నీటి భద్రత తెచ్చాం, రైతులకు మెరుగైన ధరలు దక్కేలా చూస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా... తగ్గించాం. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిస్థాయి విశ్వసనీయత వచ్చింది. దీనిని కాపాడుకోవాలి. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్ లైన్ లో ఉంచండి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదాం. చేసిన పనిని సామాజిక మాధ్యమాల్లో చెప్పుకునేలా చర్యలు ఉండాలి.

కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లు. ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలకపాత్ర. పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకం..కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలి. ప్రతీ నిమిషం నన్ను నేను బెటర్ గా తీర్చిద్దుకునేలా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటున్నాను. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకోవాలి. స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్ సిటీల ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. ప్రీవెంటివ్, క్యురెటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ద్వారా వైద్యారోగ్యాన్ని ప్రజలకు అందించాలి. ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పౌరసేవలను అందించాలని కలెక్టర్లను కోరుతున్నాను. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుంది. కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోవాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనేది చాలా ముఖ్యం..అని సీఎం పేర్కొన్నారు.

Next Story