అమరావతి: రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం, ఇరుసుమండలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాము ఇప్పటికే లీకేజీ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడామని, సహాయ చర్యలను ముమ్మరం చేయాలని సూచించినట్టు మంత్రులు సీఎంకు వివరించారు.
గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని... సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంటలను వెంటనే అదుపులోకి వచ్చేలా చూడాలని, జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు సీఎం సూచించారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.