ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ భవనం ప్రారంభం కేవలం ఆరంభం మాత్రమేనని, అమరావతి అభివృద్ధి ప్రస్థానం ఇప్పుడే మొదలైందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. వారి త్యాగాలను ఎప్పటికీ మరువలేనని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు కార్యాలయంలోని ప్రతి ఫ్లోర్‌లోకి వెళ్లి పరిశీలించారు.
కాగా రాజధాని పనులు పునఃప్రారంభం అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇది. G+7 భవనంతో పాటు మరో నాలుగు PEB భవనాలు ప్రభుత్వం నిర్మించింది. సీఆర్డీయే, ఏడీసీఎల్ తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది.
ఈ భవనం ప్రారంభంతో రాజధాని నిర్మాణ యాత్ర పునఃప్రారంభమైందని, త్వరలోనే రైతులతో మరోసారి సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.