విశాఖపట్నం ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం, రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంచనా వేశారు.
By అంజి
విశాఖపట్నం ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం, రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంచనా వేశారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ శతాబ్ది భవనాన్ని ప్రారంభిస్తూ, వైజాగ్ నగరానికి తన వద్ద ఉన్న ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. నగరం ఇప్పటికే ఆర్థిక రాజధానిగా, జ్ఞాన కేంద్రంగా రూపాంతరం చెందిందని ఆయన హైలెట్ చేశారు.
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో.. భోగాపురం విమానాశ్రయం దాదాపుగా పూర్తవుతుండటం, మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కావడం వంటి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను హైలైట్ చేశారు. ఇవి షెడ్యూల్ ప్రకారం పూర్తవుతాయని ఆయన హామీ ఇచ్చారు. గూగుల్, టాటా వంటి ప్రపంచ దిగ్గజాలతో సాంకేతిక పురోగతులు, వ్యూహాత్మక సహకారాల ద్వారా రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో విశాఖపట్నంలో గణనీయమైన మార్పులను ఆయన అంచనా వేశారు.
కింగ్ జార్జ్ హాస్పిటల్ (కెజిహెచ్) ను ఎయిమ్స్ ప్రమాణాలకు పెంచాలని, రూ.60 కోట్ల పెట్టుబడితో లెవల్-2 క్యాన్సర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనకాపల్లిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ప్రారంభించబడుతుందని తెలిపారు. "విశాఖపట్నం ఒక ముఖ్యమైన నగరం. దీనికి ముందు ముందు ఉజ్వల భవిష్యత్తు ఉంది" అని ఆయన ప్రకటించారు, ప్రశాంతతకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ప్రతి ఒక్కరూ నివసించాలని కోరుకుంటారని అన్నారు.
అంబేద్కర్, అబ్దుల్ కలాం, ఎన్టీఆర్ వంటి వ్యక్తుల దార్శనిక నాయకత్వం నుండి ప్రేరణ పొంది, పి-4 విధానం, స్వర్ణాంధ్ర 2047 వేదిక ద్వారా రాష్ట్ర పురోగతికి తన నిబద్ధతను సీఎం పునరుద్ఘాటించారు. కొత్తగా నిర్మించిన సెంటీనరీ భవన సముదాయాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. భారతదేశంలోని పురాతన సంస్థలలో ఒకటైన ఆంధ్రా మెడికల్ కాలేజీకి అత్యాధునిక సౌకర్యాన్ని సృష్టించడంలో దాతలు, పూర్వ విద్యార్థుల సమిష్టి కృషిని ఆయన ప్రశంసించారు.