ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం: సీఎం చంద్రబాబు

రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం...అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

By -  Knakam Karthik
Published on : 27 Oct 2025 4:10 PM IST

Andrapradesh, Cyclone Montha, AP Disaster Management Authority, CM Chandrababu

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం: సీఎం చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం...అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మొంథా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో తెలియజేశారు. అధికారులతో సమీక్షించి తుఫాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించి అప్రమత్తం చేస్తున్నాం. సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే పునరావాసం కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ బలగాలను మోహరించాం. విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, డ్రెయిన్ల పునరుద్ధరణ, విరిగిపడ్డ చెట్లను తొలగించేలా యంత్రాలతో బృందాలను అందుబాటులో ఉంచాం. తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు అంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను..అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

ప్రజలను అప్రమత్తం చేశాం: హోంమంత్రి

మొంథా తుపానుపై రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసినట్లు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రేపు తీరం దాటే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది అని అనిత పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పిన ఆమె..సివిల్ సప్లయిస్ విభాగం నుంచి నిత్యావసర సరుకులను తుఫాన్ బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. వర్ష బాధిత జిల్లాల్లో సహాయక చర్యల ముమ్మరం కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆమె తెలియజేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా.. వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

Next Story