హెచ్చరికలు ఫస్ట్,పెనాల్టీలు నెక్స్ట్..ఆర్టీజీఎస్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు

నేరాలు జరిగాక కట్టడి చేయడమే కాదు.. జరగకుండా చూసుకోవాలి. ప్రమాదాలు జరిగాక స్పందించడం కాదు.. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు

By Knakam Karthik
Published on : 15 July 2025 11:09 AM IST

Andrapradesh, CM Chandrababu, Review on RTGS performance, AP Government

హెచ్చరికలు ఫస్ట్,పెనాల్టీలు నెక్స్ట్..ఆర్టీజీఎస్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి: నేరాలు జరిగాక కట్టడి చేయడమే కాదు.. జరగకుండా చూసుకోవాలి. ప్రమాదాలు జరిగాక స్పందించడం కాదు.. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ పనితీరుపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్, డేటా లేక్, డేటా అనుసంధానం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అనుమానితులను గుర్తించే ఫేషియల్ రికగ్నేషన్ వ్యవస్థ పని తీరు మీద అధికారులు డెమో ఇచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “నేరగాళ్ల భరతం పట్టేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడం మంచిదే. అయితే నేరం జరిగిన తర్వాత వారిని ట్రేస్ చేసి.. ఆ తర్వాత వారికి శిక్షలు పడేలా చేయడంతో పాటు.. అసలు నేరాలు జరగకుండానే చూడాలి. ముందుగానే అనుమానితులను గుర్తించాలి. వారి కదలికలను ట్రేస్ చేయాలి. వారు ఏ తరహా నేరాలకు పాల్పడ్డారనే అంశాన్ని కూడా డేటా బేస్ లో పెట్టుకోవాలి. వారి కదలికలను గుర్తించి అలెర్ట్ అయితే చాలా వరకు నేరాలను కట్టడి చేయవచ్చు. రౌడీ షీటర్లు, క్రిమినల్స్ కు వారి వారి నేరాలను బట్టి డేటాలో కలర్ కోడింగ్ ఇవ్వాలి. అలాగే కొన్ని ప్రమాదాలను ముందుగా గుర్తించగలిగితే.. వాటిని ముందుగానే నివారించవచ్చు. ఈ మేరకు ఆర్టీజీఎస్ పని తీరు మెరుగుపడాలి.” అని చంద్రబాబు చెప్పారు.

హెచ్చరికలు ఫస్ట్... పెనాల్టీలు నెక్స్ట్

“రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేయాలి. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ రద్దీ వంటిది జరగ్గకుండా చూసుకోవాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెంటనే చలానాలు విధించకుండా.. సిగ్నల్ జంప్ చేస్తున్న వాహనాల ఫొటోలను ముందుగా వారికి పంపాలి. అలా రెండు మూడుసార్లు చూసి.. వారిలో మార్పు రాకుంటే అప్పుడు చలానాలు విధించాలి. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా సైబర్ నేరాలకు బలి అవుతున్నారు. దర్యాప్తు సంస్థలు వస్తున్నాయని ఫేక్ కాల్స్ వస్తే భయపడిపోతున్నారు. అప్పులు చేసి మరీ కోట్లాది రూపాయలు ఇచ్చేస్తున్నారు. అలాగే ఓటీపీల ద్వారా జరిగే సైబర్ మోసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.” అని సీఎం వివరించారు.

Next Story