పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

By -  Knakam Karthik
Published on : 8 Jan 2026 11:23 AM IST

Andrapradesh, Cm Chandrababu, AP Government, Polavaram Project

పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి నెలాఖరులోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తామని సీఎం స్పష్టం చేశారు. తొలి దశలో 119 టీఎంసీల నీటిని నిల్వ చేసి, కుడి-ఎడమ ప్రధాన కాలువలకు గ్రావిటీ విధానంలో నీటిని తరలిస్తామని వెల్లడించారు. పోలవరం కుడి కాలువ పనులు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని, ఎడమ కాలువ నిర్మాణాన్ని ఈ ఏడాది మార్చి చివరికి ముగిస్తామని తెలిపారు. తొలిదశ పునరావాసంలో భాగంగా 38,060 నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజీలు అందించి, అవసరమైన కాలనీలు నిర్మించి తరలించే ప్రక్రియను ఈ ఏడాది ముగింపు నాటికి పూర్తి చేస్తామని సీఎం చెప్పారు.

బుధవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు, నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు, జలవనరుల శాఖ, పునరావాస విభాగం అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించి, తరువాత మీడియాతో మాట్లాడారు. గతంలో రూ.400 కోట్ల వ్యయంతో నిర్మించిన డయాఫ్రం వాల్‌ ధ్వంసం కావడంతో, దాన్ని పక్కనపెట్టి మరో రూ.1,000 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మిస్తున్నామని సీఎం వివరించారు. ఈ పనులు ఇప్పటికే 87 శాతం పూర్తయ్యాయని, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. కుడి-ఎడమ అనుసంధాన టన్నెల్లు, నావిగేషన్ కాలువ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయని చెప్పారు. గ్యాప్-1 ప్రధాన డ్యాం పనులు జూన్ చివరికి, గ్యాప్-2 ప్రధాన డ్యాం పనులు 2027 మార్చి నాటికి పూర్తవుతాయని వెల్లడించారు.

Next Story