కుప్పంలో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్ర‌బాబు

కుప్పంలోని ఏడు పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శ‌నివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

By -  Medi Samrat
Published on : 8 Nov 2025 4:19 PM IST

కుప్పంలో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్ర‌బాబు

కుప్పంలోని ఏడు పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శ‌నివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E–Royce EV, ALEAP మహిళా పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ఏడు సంస్థలు రూ.2,203 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ఏడు సంస్థలకు కుప్పంలో ప్రభుత్వం 241 ఎకరాల భూమిని కేటాయించింది.

ఈ సంద‌ర్భంగా కుప్పం స్థానిక రైతులు, ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వ‌హించారు. హంద్రీ-నీవా కాల్వ ద్వారా నియోజకవర్గానికి నీళ్లు రావడం చాలా సంతోషంగా ఉందని కుప్పం స్థానికులు సీఎంతో అన్నారు. కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు రావడంతో తమ ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే విక్రయించే అవకాశం ఉంటుందని రైతులు సీఎంకు చెప్పారు. కుప్పానికి ఈ తరహాలో పరిశ్రమలు వస్తాయని తాము కలలో కూడా అనుకోలేదని మహిళా పాడి రైతులు సీఎంతో చెప్పారు. తల్లికి వందనం ద్వారా తాము లబ్దిపొందుతున్నామని మ‌హిళ‌లు చెప్పారు. గతంలో ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడు పరిశ్రమలు రావడంతో వలస వెళ్లాల్సిన అవసరం లేదని కుప్పం స్థానికులు చెప్పారు. పరిశ్రమలు స్థాపించడం ద్వారా తమకు ఉపాధి కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కుప్పం వాసులు ధన్యవాదాలు తెలిపారు.

Next Story