'సంజీవని' ప్రాజెక్టుపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశం
రాష్ట్ర ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు
By - Knakam Karthik |
'సంజీవని' ప్రాజెక్టుపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశం
అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సంజీవని ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేలా క్షేత్రస్థాయిలో వివిధ ప్రణాళికల్ని చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.
ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించిన సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతున్న క్రమంలో పైలెట్ ప్రాజెక్టు అమలు తీరును అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్న క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...సంజీవని ప్రాజెక్టు త్వరలో రాష్ట్రస్థాయిలో అమలు చేయబోతున్నాం. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంది. ఈ క్రమంలో దీనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇక టెక్నాలజీ వినియోగంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలతో పాటు సూచనలు చేశారు. ‘టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి... నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. శిశువుల నుంచి వృద్ధుల వరకూ సంజీవని ప్రాజెక్టు ద్వారా వైద్య సేవలు అందాలి’అని సీఎం ఆదేశించారు.
ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించడంతోపాటు... ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి... పోషకాహరాల వల్ల ఉపయోగాలేంటి అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా చూస్తున్నాం. న్యూట్రిషన్ యాప్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి’అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.