'టీ' పెట్టిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు.

By Kalasani Durgapraveen  Published on  1 Nov 2024 10:55 AM GMT
టీ పెట్టిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. దీపం 2.0లో భాగంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో లబ్దిదారులుకు ఉచిత గ్యాస్ సిలిండర్ను సీఎం చంద్రబాబు స్వయంగా అందచేశారు. లబ్దిదారుడి వంటింట్లోకి వెళ్లి సీఎం చంద్రబాబు గ్యాస్ స్టవ్ వెలిగించి టీ పెట్టారు. ఆ టీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెడ్ల మనోహార్, కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో కలిసి సీఎం చంద్రబాబు తాగారు. సీఎం చంద్రబాబు తన నివాసానికి వచ్చి స్వయంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా సిలిండర్ అందచేయడం పట్ల ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామంటూ పార్టీ మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొందు పరిచారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా శుక్రవారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.

దీపం-2 పథకంలో భాగంగా ఈ ఉచిత సిలిండర్లను ప్రభుత్వం అందిస్తుంది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. దీంతో పేదలపై గ్యాస్ భారం తగ్గుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు ఒకటి చొప్పున లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించారు.

Next Story