రాయలసీమలో చెరువులన్నీ జలాలతో కళకళలాడాలి: సీఎం చంద్రబాబు

కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు

By Knakam Karthik
Published on : 26 Aug 2025 10:21 AM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, Water Resources Department

రాయలసీమలో చెరువులన్నీ జలాలతో కళకళలాడాలి: సీఎం చంద్రబాబు

అమరావతి: కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ పూర్తిగా నింపాలని సూచించారు. రాష్ట్రంలోని చెరువులన్నీ నిండేందుకు తగిన ప్రణాళికలు చేయాలని అన్నారు. ప్రత్యేకించి రాయలసీమలోని చెరువుల్ని తక్షణం నింపేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో జల వనరుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కాలువల ద్వారా మళ్లించి చెరువుల్లోకి పంపాలని సూచించారు. ప్రధాన కాలువల నుంచి ఫీడర్ కెనాల్స్ కు ఉన్న అడ్డంకులను సరిచేసి నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అడ్డంకులు తొలగించి నీరిస్తేనే ప్రజలకు, రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లినట్టే.. మిగతా ప్రాంతాలకూ నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. సముద్రంలోకి వృధాగా ప్రవాహాలు వెళ్తుంటే బాధ కలుగుతోందని సీఎం అన్నారు. వరద నీటిని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందన్నారు.

రాయలసీమలోని చెరువులు నింపేందుకు ఎంత నీరు అవసరం, ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయన్న అంశాలను గుర్తించి వాటిని సరి చేయాల్సిందిగా సీఎం సూచించారు. తెలుగు గంగ, కుందూ నదుల విస్తరణ జరిగితేనే నీటిని దిగువన రిజర్వాయర్లకు తరలించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి రాయలసీమలోని జిల్లాలకు నీరు అందుతోందని.. సోమశిల, కండలేరు రిజర్వాయర్లను త్వరగా నింపాలన్నారు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లిలో ఉన్న చెరువులను ఈ నీటి ద్వారా నింపాలన్నారు. నిప్పుల వాగు, కుందూ విస్తరణ ద్వారా 35 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆస్కారం ఉందని అధికారులు వివరించారు. మరో మూడు రోజుల్లో సోమశిల రిజర్వాయర్ నిండుతుందని, కండలేరు రిజర్వాయర్ నింపేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముందని తెలిపారు. జీడిపల్లి నుంచి పీఏబీఆర్ కు అక్కడి నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లను నింపాలని సీఎం సూచించారు. మరోవైపు రాష్ట్రంలో భూగర్భ జలాలు రీఛార్జి చేసే అంశంపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూగర్భ జలాల సగటు నీటి మట్టం 9.92 మీటర్ల లోతున ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

Next Story