రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు

రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

By -  అంజి
Published on : 7 Jan 2026 7:13 AM IST

CM Chandrababu, officials, distribute new Pattadar passbooks, APnews

రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు

అమరావతి: రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరి చేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై మంగళవారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ...''ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలతో రైతుల్లో నమ్మకం, భరోసా కలగాలి. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలి. కొత్త పాస్ పుస్తకాలను ముద్రించే ముందుగానే గ్రామసభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాలి. రికార్డులను తారు మారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలను తీర్చిదిద్దాం. ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా, నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయకుండా పాస్ పుస్తకాలను ముద్రించాలి. పాస్ పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి'' అని ముఖ్యమంత్రి సూచించారు.

మీ భూమి-మీ హక్కు

“మీ భూమి-మీ హక్కు. ఇది రైతులకు ప్రభుత్వం కల్పించే భరోసా. ప్రస్తుతం ఇస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా తమ భూమి భద్రంగా ఉందా..? లేదా..? అనే విషయాన్ని రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రికార్డుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే... కచ్చితంగా భూ యజమాని అనుమతితోనే జరగాల్సి ఉంటుంది. రికార్డులు భద్రంగా ఉండేలా కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను రైతులకు వివరించాలి. భవిష్యత్తులో రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండానే రైతులు వారికి అవసరమైన పాస్ పుస్తకాలను ఆన్ లైన్లో పొందే విధానాన్ని అమలు చేయాలి. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకోవాలి.”అని సీఎం వివరించారు.

6.07 లక్షల పాస్ పుస్తకాల పంపిణీ

పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై సమీక్ష సందర్భంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పంపిణీ విధానాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 6.07 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని సీఎంకు తెలిపారు. పట్టాదార్ పాస్ పుస్తకాల మీద రాజముద్ర, క్యూఆర్ కోడ్ వేయడంతోపాటు... మీ భూమి-మీ హక్కు, జై భారత్... జై తెలుగుతల్లి అనే నినాదాలు కూడా ముద్రించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story