సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ క్రమంలోనే సభలో మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. చాలా ఆలోచించి పేదల సేవలో అనే పేరు పెట్టామన్నారు. ప్రతి నెలా ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతృప్తినిస్తోందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తామని చెప్పాం. నాడు చెప్పాం.. నేడు చేసి చూపుతున్నామన్నారు.
ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో ప్రతి ఏడాది రూ.15 వేలు ఇస్తామని.. అక్టోబరు 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2,90,234 మంది డ్రైవర్లు ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో లబ్దిదారులుగా ఉన్నారని.. ఏదైనా కారణాల వల్లనైనా ఎవరైనా లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోతే... వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తామన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల స్కీంను వర్తింప చేస్తున్నామని.. ఈ పథకానికి రూ.435 కోట్ల ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.12 వేలు మాత్రమే ఇచ్చేది.. మేం రూ. 15 వేలు ఇస్తున్నామని వెల్లడించారు.