ఏపీలో.. ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం: చంద్రబాబు
అమరావతి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి చిరునామా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 20 Jun 2024 2:47 PM ISTఏపీలో.. ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం: చంద్రబాబు
అమరావతి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి చిరునామా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో ఏ అంటే అమరావతి అని, పీ అంటే పోలవరం అని అన్నారు. అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు. జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి వరంగా ఉండాల్సిన పోలవరం ఓ వ్యక్తి వల్ల శాపంగా మారిందని మండిపడ్డారు.
పోలవరం పూర్తి చేసి, కొంత నదులు అనుసంధానం చేసి ఉంటే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందేదని అన్నారు. అర్హత లేని వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎంత విధ్వంసం జరుగుతుందో ఐదేళ్లలో చూశామని, అందుకే జగన్ లాంటి సీఎం అవసరం లేదని ప్రజలు విసిరికొట్టారని చంద్రబాబు అన్నారు. ఐదు కోట్ల ప్రజానీకానికి దశ, దిశ నిర్దేశించే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని తెలిపారు.
గత ఐదేళ్లలో ఒక్క బిల్డింగ్‌ను కూడా పూర్తి చేయలేదని పేర్కొన్నారు. రాజధాని అమరావతి కోసం సుదీర్ఘం పోరాటం చేసిన ఘనత రైతులకే దక్కుతుందన్నారు. రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతులంతా 1631 రోజులు ఆందోళన చేశారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆందోళన విరమించారని తెలిపారు.