ఈసారి అరాచకాలు జరగలేదనే జగన్ అసహనం.. సీఎం చంద్రబాబు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.
By Medi Samrat
టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికను రద్దుచేసి, రీపోలింగ్ జరిపించాలన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్‌పై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైఎస్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని, ఈసారి అరాచకాలు జరగలేదనే జగన్ అసహనంలో ఉన్నారని విమర్శించారు. ఆయన వైఖరి ఎలాంటిదో ప్రజలకు తెలిసిందేనన్నారు. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకాల నుంచి బయటపడుతున్నారని, ఇక్కడ నామినేషన్ వేసేందుకు భయపడే పరిస్థితి నుంచి 11 మంది పోటీ చేశారని తెలిపారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టే ప్రజలు ధైర్యంగా ఓటేశారని తెలిపారు.
కడప జిల్లా పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలపై జగన్ బుధవారం తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో రాహుల్ హాట్ లైన్‌లో టచ్ లో ఉన్నాడు. ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ ఎప్పుడైనా చంద్రబాబు గురించి మాట్లాడారా? ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తుంటే ఏనాడైనా ప్రశ్నించారా? కళ్ల ముందే చంద్రబాబు స్కామ్‌లు చేస్తుంటే ఎప్పుడు మాట్లాడరు. ఎంఆర్‌పీ రేట్ల కంటే మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు..ఎప్పుడైనా మాట్లాడారా? నా గురించి మాత్రం మాట్లాడుతారు.