అమరావతి: విశాఖ సీతంపేటలోని బెల్లం గణపతి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని విశాఖ జిల్లా కలెక్టరును ఆదేశించారు.
దుర్గాదేవి మండపం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం వద్ద గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనలో చిన్నారులకు ఎలాంటి ఆపద లేదని కలెక్టర్ తెలిపారు. మొత్తంగా 20 మంది చిన్నారులను ఆస్పత్రికి తీసుకెళ్లామని.. ఆరుగురు చిన్నారులకు గాయాలు కొంచెం ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఇక స్వల్పంగా గాయాలైన పిల్లలకు ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారని వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని... ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు చెప్పారు.