ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అదానీ వ్యవహారంపై స్పందించారు. ఏపీ శాసనసభలో పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశంపై మాట్లాడారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ నాశనం చేశారని, జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఉందని అన్నారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ తమ వద్ద ఉందని చెప్పారు. దీనిని అధ్యయనం చేసి స్పందిస్తామని తెలిపారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని, చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులను ముఖ్యమంత్రిగా జగన్ చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం, అదానీ గ్రూప్‌కు సంబంధించిన కుంభకోణానికి సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన “ఛార్జిషీట్ నివేదికలు” రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని, అవకతవకలపై చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
అమెరికా ప్రభుత్వం చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. ఆ ఆరోపణలన్నీ నిరాధారమని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, వాటిని అలా మాత్రమే చూడాలని కోరింది. కార్పొరేట్ గవర్నెన్స్ , పారదర్శకతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను తాము పాటించామని అదానీ గ్రూప్ తెలిపింది. అమెరికా కోర్టు అభియోగాలపై చేపట్టాల్సిన చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నామని అదానీ గ్రూప్ వివరించింది.