రాజధాని పరిధిలో అదనంగా 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో జరిగిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి, తుళ్లూరు మండలాల్లోని ఏడు గ్రామాల్లో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించాలన్న ప్రతిపాదనకు అథారిటీ పచ్చజెండా ఊపింది.
కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ, ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడెమీ, కిమ్స్ హాస్పిటల్ సహా 16 ప్రముఖ సంస్థలకు 65 ఎకరాల భూమిని కేటాయించేందుకు కూడా సీఆర్డీఏ అంగీకరించింది. అమరావతిలో నిర్మించనున్న ఫైవ్‌స్టార్ హోటళ్లకు సమీపంలో నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్లను నిర్మించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. రాజధాని నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు, ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుకను తవ్వుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు.