అమరావతి: అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన' యాత్రలో పాల్గొనాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ నెల 11 నుంచి 25 వరకు జరిపే యాత్రలో పాల్గొనాలి. వాజ్‌పేయీ హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశం దశ దిశ మార్చింది. వాజ్‍పేయీ స్ఫూర్తిని యువతలో నింపేలా యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి అభినందనలు.
ఈ నెల 11 నుంచి 25 వరకు చేపట్టే ఈ యాత్రలో 3 పార్టీల నేతలు పాల్గొనాలి. దేశంలో సుపరిపాలనకు వాజ్‍పేయీ నాంది పలికారు. వాజ్‍పేయీ తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాది వేశాయి. రాష్ట్రాభివృద్ధికి గతంలో వాజ్‍పేయీ ఎంతో సాయం చేశారు. రాష్ట్రం కోసం ఏది అడిగినా కాదనేవారు కాదు. సుపరిపాలన అంటే ఎన్టీఆర్, వాజ్‌పేయీని చూస్తే అర్థమవుతుంది. ప్రధాని మోదీ కూడా దేశాన్ని 2047కు నెంబర్ వన్ చేసేందుకు పనిచేస్తున్నారు. యువతరానికి మోదీ ఒక స్ఫూర్తినిస్తున్నారు. వాజ్‍పేయీ శతజయంతి కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలి..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.