సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణపై పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ, ఎడ్లబండి పై ఊరేగింపుతో, మేళా తాళాలతో, కోలాటం నృత్యాలతో జస్టిస్ ఎన్వీ రమణను గ్రామస్థులు తోడ్కొని వెళ్ళారు. ఊరేగింపుకు ముందు నిలిచిన అలంకృతమైన అశ్వాలు అందరిని కనువిందు చేశాయి.
అంతకుముందు హైదరాబాద్ నుంచి స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరానికి వెళ్తోన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులో సాదర స్వాగతం లభించింది. గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం సీజేఐకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.