ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కుంభకోణం వ్యవహారంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలిపింది.
క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ, బాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
చంద్రబాబుపై సీఐడీ మరో పీటీ వారెంట్‌ను దాఖలు చేసింది. ఫైబర్‌నెట్ కుంభకోణంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పీటీ వారెంట్ దాఖలు చేయగా, టెరాసాఫ్ట్ కంపెనీకి చంద్రబాబు ఫైబర్‌నెట్ కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ అభియోగాలు మోపింది. రూ.115కోట్ల నిధులు గోల్‌మాల్ అయ్యాయని సీఐడీ కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ కుంభకోణంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదయింది. నాటి ఎఫ్ఐఆర్‌లో ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎంపీ సాంబశివరావు ఉన్నారు. చంద్రబాబుపై ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ ఉంది.