మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనను చిత్తూరుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పదవ పరీక్షా ప్రశ్నాపత్రం లీకు కేసులో నారాయణను అరెస్ట్ చేశామని, ఆయన భార్యను అరెస్ట్ చేయలేదని చెప్పారు. మార్కుల కోసం మాల్ ప్రాక్టీస్ చేశారని ఆయన తెలిపారు. ఇన్విజిలేటర్, వాటర్ బాయ్స్ ద్వారానే పేపర్ లీకేజీ అయిందని ఎస్పీ తెలిపారు. ముందుగానే మాట్లాడి పెట్టుకుని ప్రశ్నా పత్రాన్ని లీక్ చేశారని తెలిపారు. సమాధానాలు రాసి లోపలికి పంపే ప్రయత్నం జరిగిందని, టెక్నినల్ ఎవిడెన్స్ దొరకడంతో నారాయణతో పాటు తిరుపతి డీన్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు.
అరెస్ట్‌ను ముందే ఊహించిన నారాయణ పారిపోయే యత్నం చేశారని కూడా కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. గత ఐదు రోజులుగా స్థావరాలు మార్చడమే కాకుండా ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల నారాయణ రోజుకో నివాసం మార్చారు. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లిలో ఉంటూ తప్పించుకునే యత్నం చేశారు. ఐకియా సెంటర్ వద్ద నారాయణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుండి ఏపీకి తరలించడానికి ప్రయత్నించే సమయంలో హైడ్రామా నడిచింది.