రాజ్యసభ టికెట్ అంటూ ప్రచారం.. చిరంజీవి ఏమ‌న్నారంటే..

Chiranjeevi Reacts On Rumours. ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

By Medi Samrat  Published on  14 Jan 2022 7:28 PM IST
రాజ్యసభ టికెట్ అంటూ ప్రచారం.. చిరంజీవి ఏమ‌న్నారంటే..

ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సినిమా టికెట్ల అంశంపై సీఎంతో చర్చించానని చిరంజీవి వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి చిరంజీవి వెళ్లారు. కారు దిగిన చిరంజీవికి జగన్ ఎదురొచ్చి స్వాగతం పలికారు. జగన్ తో కలిసి చిరంజీవి భోజనం చేశారు. దాదాపు గంటకు పైగా సినీ సమస్యలు, టికెట్ ధరలపై వీరు చర్చించారు. జగన్ దంపతుల ఆతిథ్యం గురించి చిరంజీవి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. పండగ పూట ఇంటికి పిలిచి ఆప్యాయంగా మాట్లాడారని అన్నారు. జగన్ సతీమణి భారతి దగ్గరుండి వడ్డించడం సంతోషకరమని చెప్పారు. తదుపరి అపాయింట్ మెంట్ ఎప్పుడని తాను అడగ్గా... ఎప్పుడంటే అప్పుడు భోజనానికి వచ్చేయండన్నా అని జగన్ అన్నారని తెలిపారు.

సీఎంతో భేటీ సంతృప్తికరంగా జరిగిందని చెప్పారు. సినిమా పరిశ్రమ ఎదిగే విషయంలో సహాయం చేస్తామని జగన్ చెప్పినట్లు చిరంజీవి తెలిపారు. త్వరలో అన్నీ మంచి విషయాలే వింటారని అన్నారు చిరంజీవి. ఈ భేటీ అనంతరం చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. దీనిపై చిరంజీవి స్పందించారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యానని.. తనకు రాజ్యసభ టికెట్ అనేది కేవలం ప్రచారమేనని అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. చిరంజీవి ఈ సాయంత్రం మళ్లీ ఏపీకి రానున్నారు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సమేతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. డోకిపర్రులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే గోదాదేవి కల్యాణోత్సవానికి చిరంజీవి కుటుంబం హాజరు కానుంది.


Next Story