అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల అవసరం మేరకు తగిన యూరియా, డిఏపి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కావున రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వ్యవసాయశాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో ఈ విషయంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆగస్టు నెలకు లక్షా 65 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో 2 లక్షల 4వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అన్నారు. అదే విధంగా డిఏపి 70 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా ప్రస్తుతం 88 వేల 248 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని కావున రైతులు ఎవరూ ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ స్పష్టం చేశారు.
కాగా సబ్సిడైజ్డ్ యూరియాను అనగా ఎజియు(అగ్రిగ్రేడ్ యూరియా)పారిశ్రామిక అవసరాలకు అనగా ఫ్లైఉడ్,పెయింట్స్,యాడ్ బ్లూ మాన్యుప్యాక్చరింగ్,పశు,కోళ్ళ పరిశ్రమల యూనిట్లు,ఆక్వా రైతులు దానా కోసం వినియోగించేందుకు దారి మళ్ళించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో వెంటనే కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించి రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక అక్కడక్కడా ఆకస్మిక తనిఖీలు చేపట్టి యూరియా దారి మళ్ళకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.