గుడ్‌న్యూస్‌.. స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్..!

రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

By Kalasani Durgapraveen  Published on  26 Nov 2024 10:46 AM GMT
గుడ్‌న్యూస్‌.. స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్..!

రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. నాడు హైదరాబాద్‌లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.

2029 కల్లా 5 లక్షల వర్క్ స్టేషన్లు :-

నూతన ఐటీ పాలసీపై మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపైనా చర్చించారు. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కో-వర్కింగ్ స్పేస్‌లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకివ్వడం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావడం వంటి అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నూతన ఐటీ పాలసీపై ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఐఐటీలతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) అనుసంధానం :-

రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు అనుసంధానంగా రాష్ట్రంలో ఐదు జోనల్ ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర.. ఇలా ఐదు ప్రాంతాల్లో జోనల్‌హబ్‌లకు కేంద్రంగా అమరావతిలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ పనిచేయాలని చెప్పారు. 5 జోనల్ హబ్‌లకు దేశంలోని 25 ఐఐటీలను అనుసంధానం చేయాలన్నారు.

ప్రతి నెలా నూతన ఉద్యోగాల కల్పనే లక్ష్యం :-

నెలకు రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని అన్నారు. పాలసీ ప్రకటన అనంతరం జిల్లా కలెక్టర్లు కూడా వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తో రాష్ట్రంలో ఎంతమంది వర్క్ ఫ్రం హోం కింద పనిచేస్తున్నారో మదింపు చేయాలన్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వర్క్ స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టత వస్తుందన్నారు. వర్క్ స్టేషన్లకు వచ్చి పని చేసుకునే వారికి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా స్కిల్ అప్‌గ్రేడ్ చేయాలన్నారు. గ్రామాల్లో నాలెడ్జ్ ఉన్న యువత మెండుగా ఉన్నారని, కానీ సరైన స్కిల్ లేకపోవడంతో రాణించలేకపోతున్నారని, ఆ మేరకు వారిలో నైపుణ్యం పెంపొందించాల్సి ఉందన్నారు.

డెవలపర్లకు కేటగిరీల వారీగా రాయితీలు :-

ఐటీ సంస్థల కోసం మౌలిక వసతులు కల్పించే డెవలపర్లకు ఇచ్చే రాయితీలను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. కో వర్కింగ్ స్పేస్‌లు, నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌లు, ఐటీ క్యాంపస్‌లకు వాటి సీట్ల సామర్ధ్యం, కార్యాలయ సముదాయం విస్తీర్ణానికి అనుగుణంగా సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కో వర్కింగ్ స్పేస్‌కు సబ్సిడీ పొందాలంటే కనీసం 100 సీట్ల సామర్ఢ్యం కానీ, 10 వేల చదరపు అడుగుల కార్యాలయ సముదాయం ఉండాలి. అలాగే నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌కు పది సీట్ల సామర్ధ్యం కానీ, వెయ్యి చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ తప్పనిసరి. ఐటీ క్యాంపస్‌కు వచ్చేసరికి 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రూ. 30 కోట్ల టర్నోవర్ కానీ కనీసం 100 మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా తుది ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Next Story