రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా సంబేపల్లె మండలం యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రమ మృతి దురదృష్టకరమని కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురికి అత్యవసర వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అన్నమయ్య జిల్లా యర్రగుంట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రీవెన్స్ కు వెళ్తూ ప్రమాదంలో హంద్రీనీవా డిప్యూటీ కలెక్టర్ రమ మృతి చెందటం బాధాకరం అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యులు సేవలు అందించాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో ఫోన్ లో మాట్లాడి ఆరా తీశారు. డిప్యూటీ కలెక్టర్ రమ కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.