రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మరో వారంరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి.. సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు తెలపగా.. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగింపులోగా నిధులు తెచ్చుకోవాలని తెలిపారు. హైదరాబాద్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ రివ్యూకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, సిఎంవో అధికారులు పాల్గొన్నారు.