Andrapradesh: సంజీవని ప్రాజెక్టులో పౌరుల డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By - Knakam Karthik |
Andrapradesh: సంజీవని ప్రాజెక్టులో పౌరుల డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
అమరావతి: వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులు, ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం తీసుకొస్తున్న వివిధ నూతన విధానాలపై చర్చిస్తున్నారు. ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
కాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందం హాజరయ్యారు. సలహా బృందంలో UN AIDS ప్రతినిధి పీటర్ పాయిట్, WHO సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, ఎఐజి చైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టియో, ఆర్తి అహుజా, రిజ్వాన్ కొయిటా, శ్రీకాంత్ నాదముని, గగన్ దీప్ కాంగ్, మార్గరెట్ ఎలిజిబెత్, నిఖిల్ టాండన్, ఇతర వైద్య నిపుణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనల్ని అమలు చేస్తున్నాం. పౌరులకు సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నాం. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశాం. రియల్ టైమ్‌లోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. వివిధ అంశాల్లో పౌరులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుంది. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాల ద్వారా అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా మేం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆరోగ్య సమస్యల కోసం యోగాతో పాటు నేచురోపతిని ప్రోత్సహించాల్సి ఉంది. ప్రివెంటివ్ వెల్ నెస్, డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్ లాంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలి
వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలి. ఏపీలో మెడ్ టెక్ పార్కు ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నాం. రోగం వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల కంటే ఆ జబ్బు రాకుండా ముందస్తుగానే నియంత్రించేలా ప్రివెంటివ్ టెక్నాలజీస్‌పై దృష్టి పెట్టాలి. తద్వారా వైద్యారోగ్యంపై వ్యయాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. వైద్యారోగ్య రంగంలో మరింత వినూత్నంగా ప్రాజెక్టులు చేపట్టేందుకు అత్యున్నత స్థాయి ఎక్స్ పర్ట్ గ్రూప్ సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రతీ రంగంలోనూ టెక్నాలజీ ద్వారా అత్యుత్తమ ప్రమాణాలు తీసుకురావాలన్నది మా లక్ష్యం. సామర్ధ్యాల పెంపుతో పాటు ప్రజలకు అత్యున్నత సేవలు అందాలి. క్వాంటం, ఏఐతో రియల్ టైమ్ డేటా విశ్లేషణ లాంటి వాటి ద్వారా ప్రజలకు సేవలు అందాలి. ప్రస్తుతం ఏఐ ద్వారా నాలెడ్జి వ్యవస్థీకృతం అయ్యింది. గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించేలా ప్రస్తుతం అంతా సామర్ధ్యాలను పెంచుకోవాల్సి ఉంది..అని సీఎం వ్యాఖ్యానించారు.